Prawns Price Dropped Highly Due To Trump Tariffs Effect : విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టి వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆక్వా పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఓ వైపు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వైరస్‌లు మరోవైపు నాణ్యమైన రొయ్య విత్తనం, మేతలు దొరక్క ఇబ్బంది పడుతున్న రైతులను అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు అథఃపాతాళానికి తొక్కినట్లైంది. దిగుమతి సుంకం కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్న రంగాల్లో ఆక్వా ముందు స్థానంలో ఉండగా అమాంతం ధర పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయారు.
ట్రంప్ నిర్ణయంతో ధరలు పతనం : ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు వ్యాధులు, మరోవైపు ధరల పతనం, పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న రంగానికి ట్రంప్ నిర్ణయం మింగుడుపడటం లేదు. దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కిలో ధర గరిష్ఠంగా 40 రూపాయలు వరకూ పడిపోయింది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో లక్షా 20వేల ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తుండగా ఏటా వస్తున్న 4లక్షల టన్నుల ఉత్పత్తుల్లో 3.5టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల వల్ల ఏటా రూ.18వేల కోట్ల వ్యాపారం జరుగుతుండగా ఇందులో విదేశీ లావాదేవీల వాటా అధికంగా ఉంది. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఆక్వాఉత్పత్తులపై పడింది. 100 కౌంట్ 240గా ఉన్న రొయ్యల ధర అమాంతం 200కి పడిపోయింది.
దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతులు : సాధారణంగా వేసవి కాలం రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన వాతావరణాలతో పోల్చితే వేసవిలో రొయ్యలకు వైరస్ తక్కువగా రావడం, గ్రోత్ అనుకున్నట్లు రావడంతో ఈ సీజన్‌లోనే సాధాణరం కంటే ఎక్కువ విస్తీర్ణంలో రొయ్యల సాగు చేస్తుంటారు. ప్రతీకార సుంకం వల్ల ఇప్పటికే పట్టుబడులకు వచ్చిన పంటను పట్టాలో లేక చెరువుల్లోనే ఉంచాలో తెలీక ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి వైరస్‌ల దాడిని అధిగమించి పంటను ఎక్కువకాలం ఉంచడం మంచిది కాదని కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆక్వారంగం కోలుకునే పరిస్థితి లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా జోన్లతో సంబంధం లేకుండా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామంటూ చెప్పడం సహా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై ఆక్వా రైతులు సంతోషించే లోపే ట్రంప్ ప్రతీకార సుంకాల నిర్ణయం శరాఘాతంగా మారిందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ - గంటల వ్యవధిలోనే పతనమైన రొయ్యల ధరలు