P4 Program in AP : ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో పీ-4 కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. సొంత డబ్బులతో కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ప్రసాద్ సీడ్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు లిఫ్ట్ స్కీం నిర్మాణానికి రూ.10 కోట్లు విరాళం ఇస్తామని ప్రసాద్ సీడ్స్ ఛైర్మన్ ప్రసాద్ ప్రకటించారు. తద్వారా కొమ్మమూరు ఎత్తిపోతల నిర్మాణంతో కాకుమాను మండలంలో 5315 ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ కానుంది.
రైతుల కోసం లిఫ్ట్ నిర్మాణానికి ముందుకు వచ్చిన ప్రసాద్ ఔదారాన్ని చంద్రబాబు అభినందించారు. ఇందులో భాగంగా ఆ సంస్థతో సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా మంచి చేయాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రసాద్ తెలిపారు. సంపాదించిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తే ఆర్థిక అసమానతలు తొలగుతాయని ఆయన అన్నారు.
అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం ప్రతిపాదిస్తున్న పీ-4 కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ ఉగాది నాడు ప్రారంభించిన విషయం తెలిసిందే. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలకు అదనంగా ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూతను ఇచ్చే ప్రయత్నం చేయనుంది. ఈ సందర్భంగా పీ-4 లోగోను ప్రభుత్వం ఆవిష్కరించింది.
Prasad Seeds on Kommamuru Lift Irrigation : అదేవిధంగా swarnaandhrap4@ap.gov.in మెయిల్ ఐడీ, 8008944791 ఫోన్ నంబర్‌తో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్గా ఈ విధానం ఉండనుంది. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించింది. సంపదలో పైవరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలబడటమే పీ-4 ప్రధాన ఉద్దేశం. ఇందుకు నిర్మాణాత్మక, స్థిరమైన విధానం ఉండేలా చర్యలు చేపట్టింది.
మొదటగా ఏపీలోని 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్టుతో 5869 కుటుంబాలు లబ్ధి పొందుతాయి. మార్గదర్శి- బంగారు కుటుంబం నినాదంతో మంగళగిరికి చెందిన గొర్రెల కాపరి కడియం నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయెల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేసింది. సమాజం ఇచ్చిన గుర్తింపుకు కృతజ్ఞతగా తిరిగి సమాజానికి ఏదోకటి చేయాలనే నినాదమే పీ-4 అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ దీనికోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
నా జీవితం ప్రజలకే అంకితం : సీఎం చంద్రబాబు
కష్టమైనా ఇష్టంగా పని చేస్తున్నా - అన్ని పరిష్కరిస్తాం : సీఎం చంద్రబాబు